టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. 50 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమను సంప్రదిస్తున్నారని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో వైసీపీ ఖాళీ అవుతుందని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాపై మూడేళ్లుగా ఏం చేశారని ప్రశ్నించారు. రాజ్యసభ ఎన్నికల ఓటమి భయంతోనే గంటా రాజీనామాను ఇప్పుడు హడావుడిగా ఆమోదించారని మండిపడ్డారు. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ తరపున అభ్యర్థిని నిలబెట్టాలని తమ అధినేత చంద్రబాబును కోరుతున్నానని చెప్పారు. టీడీపీ అభ్యర్థిని నిలబెడితే తాము గెలిపించుకుంటామని అన్నారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పరిటాల రవి వర్ధంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారని గోరంట్ల విమర్శించారు. ఎక్కడ చూసినా అవినీతే కనపడుతోందని… చివరకు అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు పేరుతో కూడా దోచుకున్నారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ అవినీతిని బట్టబయలు చేస్తామని చెప్పారు. జగన్ పాలనలో దళితులు, బీసీలు, బలహీనవర్గాలపై దాడులు జరిగాయని అన్నారు.