ఏపీ ఎన్నికల్లో మూడు పార్టీలు పొత్తు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. పొత్తులో టీడీపీ పార్టీ కి 144 ఎమ్మెల్యే, 17 ఎంపీ సీట్లు ఖరారయ్యాయి. వీటన్నింటికీ అభ్యర్థులను ప్రకటించేసింది తెలుగుదేశం పార్టీ. టికెట్ కన్ఫామ్ చేసుకున్న అభ్యర్థులు ప్రచారాన్ని పరుగులు పెట్టించే పనిలో ఉన్నారు. అయితే టీడీపీ అభ్యర్థుల్లో మార్పులు ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. పెద్దగా మార్పులు ఉండకపోయినా.. ఆ ఒక్క ఎంపీ సీటులో మాత్రం మారుస్తారని వార్తలు వస్తున్నాయి. అదే ఏలూరు ఎంపీ సీటు. వివరాల్లోకి వెళ్తే బీజేపీకి కేటాయించిన నరసాపురం ఎంపీ సీటును తీసుకుని ఏలూరు ఎంపీ సీటును బీజేపికి ఇచ్చే ఆలోచనలో టీడీపీ ఉన్నట్లు సమాచారం. పొత్తులో భాగంగా టీడీపీ 17, బీజేపీ 6, జనసేన 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తమకు వచ్చిన ఆరు ఎంపీ సీట్లకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా నరసాపురం ఎంపీ సీటును ,సిట్టింగ్ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజుకు కాకుండా భూపతిరాజు శ్రీనివాసవర్మకు కేటాయించారు. అయితే వైసీపీ నుంచి గెలిచి కూడా.. ఆ పార్టీపై ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్న రఘురామకు టికెట్ వస్తుందని రాజకీయవర్గాలతో పాటు టీడీపీ నేతలు కూడా ఆశించారు. బీజేపీ, టీడీపీలలో ఏదో ఒక పార్టీ నుంచి ఆయన నరసాపురం బరిలో ఉంటారని అనుకున్నారు. కానీ కమలం పార్టీ పెద్దల ట్విస్టుతో నరసాపురం రాజకీయం మారిపోయింది. ఈ క్రమంలో రఘురామకృషంరాజును ఎలాగైనా ఈసారి బరిలోకి దింపాలని టీడీపీ అధిష్టానం భావిస్తుందట. అందుకే ఏలూరు ఎంపీ సీటును బీజేపీకి ఇచ్చి.. బదులుగా నరసాపురం సీటు తీసుకోవాలని భావిస్తున్నట్లు గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కట్టే విధంగా రఘురామకృష్ణరాజు ఢిల్లీలో అనేక ప్రయత్నాలు చేశారని.. అందుకే ఆయనకు ఎలాగైనా టికెట్ ఇవ్వాలని రెండు పార్టీలపై కొంచెం ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ అధిష్టానం యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేష్ యాదవ్‌కు టికెట్ కేటాయించింది. ఇక నరసాపురం ఎంపీ సీటు టీడీపీ తీసుకుంటే ఏలూరు ఎంపీ సీటును బీజేపీకి ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు బీజేపీ తరుఫున గారపాటి తపన చౌదరి ఏలూరు ఎంపీగా పోటీచేస్తారనే వార్తలు గుప్పుమంటున్నాయి. మరి దీనిపై రెండు పార్టీల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.