తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ గా ఉన్న మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ అయితే రావడంలేదు. దీంతో మహేష్ బాబు అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్ ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. రాజమౌళి సినిమాలంటే అంచనాలు భారీగా ఉంటాయి. మహేష్ బాబుతో చేసే సినిమా ప్రపంచస్థాయిలో అద్భుతాలు సృష్టిస్తుందనే అంచనాలున్నాయి. కథను ఎప్పుడో సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రీప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి. బుర్రా సాయిమాధవ్ డైలాగులు రాస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు సంబంధించిన ఓ విషయాన్ని బయటపెట్టారు. సినిమా కథను ఓ ఇంగ్లిష్ కథల పుస్తకం నుంచి తీసుకున్నట్లు వెల్లడించారు. రాజమౌళికి దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్ స్మిత్ రచనలంటే చాలా ఇష్టమని, మేమిద్దరం వాటిని బాగా ఇష్టపడతామని, అభిమానులమని విజయేంద్రప్రసాద్ తెలిపారు. ఆ పుస్తకాల ఆధారంగానే స్క్రిప్ట్ రాసుకున్నట్లు వెల్లడించారు. దీనిపై అనేక రకాల వార్తలు వస్తున్నాయని.. పుకార్లు చక్కర్లు కొడుతున్నాయన్నారు. ఇక ఈ సినిమా కథ కాపీనా అంటూ కొంతమంది అనవసరమైన వార్తలు వ్యాపింపజేస్తున్నారన్నారు. అయితే
ఈ సినిమా కథ కొన్ని పుస్తకాల ఆధారంగా రాసుకున్నట్టు విజయేంద్రప్రసాద్ మాటలను బట్టి తెలుస్తోంది. ఊహాత్మక కథ అని తెలుస్తోంది. సినిమాలో మాత్రం ప్రిన్స్ కొత్త లుక్ లో కనిపించబోతున్నారు. అడ్వెంచర్ థ్రిల్లర్ గా సినిమా ఉంటుందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. అభిమానులతోపాటు సినీ ప్రియులంతా దీనిపై అంచనాలు భారీగా పెట్టుకున్నారు.