ఐదుగురి పేర్లతో వైసీపీ తన 8వ జాబితా ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో రెండు ఎంపీ స్థానాలు, మూడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గుంటూరు ఎంపీ స్థానం సమన్వయకర్తగా కిలారు రోశయ్య, పొన్నూరు సమన్వయకర్తగా అంబటి మురళి, ఒంగోలు లోక్ సభ స్థానం సమన్వయకర్తగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కర్తగా బుర్రా మధుసూదన్ యాదవ్, గంగాధరనెల్లూరు సమన్వయకర్తగా కల్లత్తూర్ కృపాలక్ష్మి పేర్లను వైసీపీ అధినాయకత్వం ప్రకటించింది.ఇందులో చెవిరెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యే కాగా… ఆయనను ప్రకాశం జిల్లాకు పట్టుకొచ్చారు. బుర్రా మధుసూదన్ యాదవ్ కనిగిరి ఎమ్మెల్యే కాగా, ఆయనను కందుకూరుకు బదిలీ చేశారు. కొన్ని వారాల కిందటే వైసీపీలో చేరిన అరవింద యాదవ్ ను కందుకూరు ఇన్చార్జిగా తొలుత ప్రకటించినప్పటికీ, ఆమె ఆసక్తి చూపకపోవడంతో బుర్రా మధుసూదన్ యాదవ్ ను కందుకూరు బరిలో దింపుతున్నారు.దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యంగ్యం ప్రదర్శించారు. “తిక్కోడు తిరునాళ్లకు పోతే… ఎక్కడం దిగడంతోనే సరిపోయిందంట… అలా ఉన్నాయి వైసీపీ వరుస సమన్వయకర్తల జాబితాలు” అని ఎద్దేవా చేశారు.