నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు రానున్న ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమైనట్టు తెలుస్తోంది. నిన్న చంద్రబాబును కలిసిన రఘురామకృష్ణరాజు పార్టీలో చేరే అంశమై చర్చించగా, చంద్రబాబు ఆయనకు టికెట్ పై భరోసా ఇచ్చినట్టు సమాచారం. సమీకరణాలు, పరిస్థితులు అన్నీ కుదిరితే రఘురామ ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి.

ఇక, రఘురామకృష్ణరాజు ఎన్నికల్లో పోటీ చేయడంపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. విజయవాడలో రఘురామతో కలిసున్న ఫొటోను పోస్టు చేసిన పట్టాభి… “మరి కొన్ని గంటల్లో ఎన్నికల సమరంలోకి అడుగుపెడుతున్న మా అగ్రజులు రఘురామకృష్ణరాజు గారితో ఈ ఉదయం విజయవాడలో” అంటూ ట్వీట్ చేశారు. రఘురామ టీడీపీలో చేరనుండడం, ఆయనకు టికెట్ లభించడం ఖాయమేనని పట్టాభి తాజా పోస్టు స్పష్టం చేస్తోంది.