‘నేను బాగుండాలి.. నేనే బాగుపడాలి’ అన్నది వైసీపీ నాయకుడికి పుట్టుకతో వచ్చిన బుద్ధి అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. ఈ విషయం తాను ఎప్పుడో గుర్తించాను కాబట్టే మొదటి నుంచీ వైసీపీని వ్యతిరేకిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈమేరకు మంగళవారం తెనాలిలో నిర్వహించిన నియోజకవర్గ నాయకుల ఆత్మీయ సమావేశంలో జనసేనాని పాల్గొని ప్రసంగించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో నాదెండ్ల మనోహర్ ను గెలిపించాలని తెనాలి ప్రజలకు పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల్లో తెనాలిలో ఎగిరేది జనసేన జెండానేనని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. జగన్ సర్కారు ప్రజలపై ఇబ్బడిముబ్బడిగా పన్నులు వేస్తోందని, చివరకు చెత్తపైన కూడా పన్ను వేస్తోందని పవన్ మండిపడ్డారు. పన్నులతో ప్రజల నడ్డి విరుస్తూ సేకరించిన సొమ్ముతో సంక్షేమ కార్యక్రమాలు చేపడతామంటే ఎలాగని జనసేనాని నిలదీశారు. జనసేన నాయకుడిని గెలిపిస్తే నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏంటో ప్రజలకు చూపిస్తామని, అద్భుతమైన పనులు చేస్తామని నాదెండ్ల మనోహర్ చెప్పారు. జగన్ పాలనతో ప్రజలు విసిగిపోయి జనసేన వైపు చూస్తున్నారని, కార్యకర్తలంతా సమష్టిగా పనిచేసి పార్టీని గెలిపించాలని కోరారు.

Previous article2-8-2023 TODAY E-PAPER
Next article మణిపూర్ లో 3 నెలల్లో 30 మంది మిస్సింగ్