నేటి రాజకీయాలలో రాజకీయం ఎన్నికలంటేనే తప్పుడు హామీలతో ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మారిపోయింది . డబ్బులు పంచూతూ ప్రజలను ప్రలోభాలకు గురిచేసే విధంగా తయారయ్యింది. ఎన్నికల సమయం వచ్చిందటే చాలు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చేస్తుంటారు ఆయా పార్టీ నేతలు . ఇక అసలు విషయానికి వస్తే తాజాగా, తమిళనాడులోని ఓ పార్టీ నేత తమ అభ్యర్థిని గెలిపిస్తే ఖరీదైన కారు, బంగారు గొలుసులను బహుమతి ఇస్తామని ప్రకటించారు. ప్రస్తుతం ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులో 39 లోక్‌సభ స్థానాలకు మొదటి దశలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే . ఏప్రిల్ 19న అక్కడ పోలింగ్ నిర్వహించనుండగా.. త్రిముఖ పోరు నెలకొంది . డీఎంకే, అన్నాడీఎంకేతో పాటు బీజేపీ కూడా చిన్నాచితకా పార్టీలో పొత్తులు పెట్టుకుని అభ్యర్థులను నిలిపింది. అయితే డీఎంకే, అన్నాడీఎంకే కూటమి మధ్యే ప్రధాన పోటీ ఉంది. ఈ నేపథ్యంలో కీలకమైన తిరుచ్చి నియోజకవర్గంలో డీఎంకే మిత్రపక్షం ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి దురైవైగో, అన్నాడీఎంకే నుంచి పుదుకోట్టైకు చెందిన కరుపయ్య అనే వ్యక్తి పోటీ చేస్తున్నారు. ఏఎంఎంకే తరఫున కార్పొరేషన్‌ కౌన్సిలర్‌గా ఉన్న సెంథిల్‌నాథన్‌, ఎన్‌టీకే నుంచి రాజేష్‌ బరిలో ఉన్నారు. ఈ స్థానంలో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో అన్నాడీఎంకే ఉంది. అందుకే తమ అభ్యర్థిని గెలిపిస్తే పార్టీ నగర కార్యదర్శి, మండల కార్యదర్శికి కారు, బంగారు చెయిన్‌ బహుమతిగా ఇస్తామని మాజీమంత్రి విజయభాస్కర్‌ సంచలన ప్రకటన చేశారు. మాజీ మంత్రి విజయభాస్కర్‌ సిఫారసు మేరకు అన్నాడీఎంకే అధిష్టానం కరుపయ్యకు టిక్కెట్ కేటాయించింది. తన వర్గం నేత గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న విజయభాస్కర్… కరుపయ్యను గెలిపించుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఆయన్ను గెలిపిస్తే ఇన్నోవా కారు, ఐదుసవర్ల బంగారు చెయిన్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించటం ఇప్పుడు వైరల్ గా మారింది .