ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలోని గోపాలపురంలో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ , టీడీపీ బలగాలు స్పీడు పెంచాలని, ఫ్యాన్ తుక్కు తుక్కు అయిపోవాలని పిలుపునిచ్చారు. గతంలో ఏ ముఖ్యమంత్రిని కూడా సైకో అనలేదని, ఇప్పుడెందుకు అంటున్నామో ఆలోచించాలన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలని ,ఇక్కడ వెంకట్రాజు కోసం నొక్కాలని, మరో బటన్ పార్లమెంటు అభ్యర్థి పురందేశ్వరి కోసం కమలం గుర్తుపై నొక్కాలని పిలుపునిచ్చారు. ఇక జగన్ గురించి బాబు మాట్లాడుతూ “ఈ సీఎం ఎంత మోసం చేస్తాడంటే… అన్నీ నంగనాచి కబుర్లు చెబుతాడని , మొదట సిద్ధం అన్నాడు, ఇప్పుడు మేమంతా సిద్ధం అంటున్నాడని ఎద్దేవా చేశారు . ఒక్కో మీటింగ్ కు 1500 బస్సులు పెడుతున్నారంటే వీళ్ల అబ్బ సొమ్మా, ఈ రాష్ట్రం వీళ్ల తాత జాగీరా? అంటూ ప్రశ్నిచారు. మనుషులకు డబ్బులిచ్చి, బిర్యానీ పెట్టి, మద్యం పోయించి మత్తులో ముంచి… వాళ్లను మీటింగ్ కు తీసుకొస్తున్నారన్నారని చంద్రబాబు అన్నారు. మీటింగ్ కి రాకపోతే పెన్షన్లు ఇవ్వబోమని బెదిరిస్తున్నారట, మీ తాత సొత్తా? అంటూ ధ్వజమెత్తారు. ధర్మాన్ని మనం కాపాడుకుంటే ఆ ధర్మం మనల్ని కాపాడుతుందని బాబు అన్నారు . దేశంలోనే అతి పెద్ద ప్రాజెక్టు పోలవరం ఇక్కడే ఉందని ,. భారీ వరద సంభవిస్తే 50 లక్షల క్యూసెక్కుల నీళ్లు వస్తాయని , ఈ ప్రాజెక్టుకు ఏదైనా ప్రమాదం వస్తే ఉభయ గోదావరి జిల్లాలు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటాయన్నారు . ఇది ఇక బహుళ ప్రయోజక ప్రాజెక్టని , దీని ద్వారా 2 వేల టీఎంసీల నీటిని వాడుకోవచ్చని , తద్వారా ఈ రాష్ట్రంలో కరవు అనే మాటే వినిపించదని చంద్రబాబు తెలిపారు .