ప్రాజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విశాఖ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… 7 ప్రధాన అంశాలతో ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పారు. మంచి పాలన కావాలనుకునే వాళ్లంతా ప్రజాశాంతి పార్టీకి ఓటు వేయాలని కోరారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖను రాజధాని చేస్తామని హామీ ఇచ్చారు. విశాఖను వాషింగ్టన్ చేస్తానని చెప్పారు. తాను సీఎం అయితే రాష్ట్రానికి ప్రస్తుతమున్న రూ. 13 లక్షల కోట్ల అప్పు తీరిపోతుందని అన్నారు. తాను ముఖ్యమంత్రి కావడం కొందరికి ఇష్టం లేదని చెప్పారు. 

తాను ముఖ్యమంత్రి అయితే ఉత్తరాంధ్రలో ఏటా 2 లక్షల ఉద్యోగాలు వచ్చేలా చేస్తానని కేఏ పాల్ అన్నారు. విశాఖను డ్రగ్స్, గంజాయి రహిత నగరంగా మారుస్తానని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం కాకుండా కాపాడతానని తెలిపారు. తన పోరాటం కాణంగానే ఏప్రిల్ లో జరగాల్సిన ఎన్నికలు మేలో జరుగుతున్నాయని చెప్పారు.