ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను గాలికి వదిలేశారని… పక్క పార్టీ వాళ్ల ఇళ్లచుట్టూ తిరుగుతున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక రైతులను గాలికి వదిలేశారని… 100 రోజుల్లో నెరవేరుస్తామన్న హామీల విషయంలో మోసం చేశారని మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సురుకు పెడితేనే దారికి వచ్చి హామీలను అమలు చేస్తారన్నారు. 

మెదక్ పార్లమెంట్‌ బీఆర్‌ఎస్ అభ్యర్థికి మద్దతుగా నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ… ధాన్యం క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు రైతుబంధు ఇస్తామంటే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి ఆపివేయించారని విమర్శించారు. దుక్కికో.. నాటుకో ఉపయోగపడే రైతుబంధు డబ్బులు పంట కోతకొచ్చినా రాలేదన్నారు. రైతుబంధు కోసం తాము ఉంచిన డబ్బులు కాంగ్రెస్‌ కాంట్రాక్టర్లకు ఇచ్చిందని ఆరోపించారు.