టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఏర్పాటు చేసిన రా కదలిరా సభకు హాజరయ్యారు. సభకు పోటెత్తిన ప్రజానీకాన్ని చూసి చంద్రబాబు ఉత్సాహంగా ప్రసంగించారు. తన ప్రసంగంలో అధికార వైసీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నంద్యాల జిల్లా ప్రజల జోరుకు వైసీపీ ప్రభుత్వ పతనం ఖాయమని పేర్కొన్నారు. ఈ జన సునామీ చూసి తాడేపల్లి పిల్లి వణుకుతోందని అన్నారు. 

వైసీపీ పాలనలో రాష్ట్రం ధ్వంసమైందని చంద్రబాబు విమర్శించారు. ఈ ఐదేళ్లలో యువత నిరుద్యోగులుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికలతో అందరి కష్టాలు తీరతాయని స్పష్టం చేశారు. రాతియుగం వైపు వెళతారా… స్వర్ణయుగం కోసం నాతో వస్తారా? అని ప్రశ్నించారు. 

ఒక్క చాన్స్ అంటే అందరూ నమ్మి జగన్ కు ఓటేశారని, అనర్హులను అందలం ఎక్కించి అనేక బాధలు పడుతున్నామని వివరించారు. జగన్ కు తెలిసింది రద్దులు, కూల్చివేతలు, దాడులు, కేసులేనని చంద్రబాబు విమర్శించారు. రాయలసీమలో అన్ని వనరులు ఉన్నాయని చెప్పారు. తాము ఓర్వకల్లుకు 15 నెలల్లోనే విమానాశ్రయం తీసుకువచ్చామని, అవుకు టన్నెల్ ను తామే పూర్తి చేశామని వెల్లడించారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పనులు చేసింది టీడీపీ ప్రభుత్వమేనని వివరించారు.