క్రికెట‌ర్ పృధ్వీషా- న‌టి స‌ప్నాగిల్ వివాదం గ‌తేడాది సంచలనంగా మారింది. గొడ‌వ నుంచి కేసు వ‌ర‌కూ అప్పట్లో ఎన్నో మ‌లుపులు చోటు చేసుకున్నాయి. ఒక‌రిపై ఒక‌రు కేసులు పెట్టుకుని , పోలీస్ స్టేష‌న్..కోర్టు అంటూ చాలా పెద్ద హంగామానే న‌డిచింది. ఇప్ప‌టికీ కోర్టులో కేసు న‌డుస్తుంది. అయితే ఈకేసులో పృధ్వీ షాపై లైంగిక ఆరోప‌ణ‌ల‌కు సంబంధించి విచార‌ణ చేప‌ట్టాల‌ని తాజాగా ముంబై కోర్టు పోలీసుల్ని ఆదేశించింది. జూన్ 19 లోపు ఈ కేసుకు సంబంధించి నివేదిక అంద‌జేయాల‌ని తెలిపింది. దీంతో షా ఇప్పుడు పోలీసు విచార‌ణ ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని తెలుస్తోంది. ముంబైలోని ఓ హోటల్‌లో క్రికెటర్ పృథ్వీ షా తో సెల్ఫీ విషయంలో నటి సప్నా- ఆమె స్నేహితుడు శోభిత్ ఠాకూర్‌తో వాగ్వాదానికి దిగారు. హోటల్ బయట సప్న- ఆమె స్నేహితుడు శోభిత్ ఠాకూర్ బేస్ బాల్ తో పృథ్వీ షా పై దాడి చేసేందుకు ప్రయత్నించారు. పృథ్వీ షా కారును కూడా వెంబడించి కారును అడ్డుకుని కారు అద్దాలు పగలగొట్టారు. ఆ తర్వాత పృథ్వీ- సప్నలపై పోలీసు కేసు నమోదైంది. మూడు రోజుల క‌స్ట‌డీ తర్వాత సప్న బెయిల్ పై బ‌య‌ట‌కు వచ్చి వెంట‌నే షాపై అంధేరీ పోలీస్ స్టేష‌న్ లో కేసు పెట్టే ప్రయత్నం చేసింది . పోలీసులు ఎఫ్ ఐఆర్ న‌మోదు చేయ‌క‌పోవ‌డంతో అంధేరీ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్ర‌యించింది. ఈ సంద‌ర్భంగా కోర్టులో ఆమె చెప్పాల్సింది అంతా చెప్పింది. ` తన స్నేహితుడు శోభిత్ ఠాకూర్ పృథ్వీ షాను సెల్ఫీ అడిగాడు. పృథ్వీ షా ఎవరో నాకు తెలియదు. అతను క్రికెటర్ అని కూడా తెలియదు. మేము ఇద్దరమే ఉన్నాం. పృథ్వీ షాతో పాటు ఎనిమిది మంది స్నేహితులు ఉన్నారు. ఆ టైంలో పృథ్వీ షా తాగి ఉన్నాడని సప్నా గిల్‌ కోర్టుకు వివరించింది . కోర్టులో సప్నా గిల్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పృథ్వీ షాకు మద్యం తాగే అలవాటుందని , అందుకే బీసీసీఐ పృద్వి పై నిషేధం విధించిందని మీడియాలో వచ్చిన కథనాలను న్యాయవాది కోర్టు ముందుంచాడు . అదేవిధంగా పృథ్వీ నుంచి సప్నా గిల్‌ 50 వేలు డిమాండ్ చేసిన‌ట్లు వస్తున్న ఆరోప‌ణ‌లను న్యాయవాది ఖండించారు. పృథ్వీ షా బృందం చేసిన ఆరోపణలు అవాస్తవం అన్నారు. వీటిపై షా కూడా కౌంట‌ర్ దాఖ‌లు చేసి పోరాటం చేస్తున్నాడు. తాజాగా స్వప్న లైంగిక ఆరోప‌ణ‌లు కూడా చేయ‌డంతో కేసు మ‌రింత జ‌ఠిలంగా మారింది.