జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి మార్చి 30 వ తేదీ పిఠాపురం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్బంగా జనసేన పార్టీ అవసరాల కోసం పవన్ కళ్యాణ్ భారీ విరాళాన్ని అందజేశారు . ఆయన సినిమాల ద్వారా సంపాందించిన 10 కోట్లను జనసేన పార్టీకి విరాళంగా అందించారు. జనసేన పార్టీ ఉన్నతి కోసం తన స్వార్జితాన్ని వెచ్చిస్తూ వస్తున్న జనసేనాని మరోసారి 10 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో పార్టీ కోశాధికారి ఎ.వి‌.రత్నంకు విరాళం చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ .. స్వతంత్ర సంగ్రామాన్ని ముందుకు నడపించడానికి మోతీలాల్ నెహ్రూ వంటి గొప్ప నాయకులు తమ స్వార్జితాన్ని ఉద్యమానికి విరాళంగా ఇచ్చేవారని గుర్తు చేశారు. ఆ రోజుల్లో తమ సొంత డబ్బును వెచ్చించిన తీరు చాల గొప్పదని ఆయన అన్నారు. ఓ మంచి ఆశయం కోసం, రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దడం కోసం జనసేన సాగిస్తున్న రాజకీయ ప్రయాణానికి తన వంతుగా ఇప్పుడు ఎన్నికల ప్రచార ఖర్చుల నిమిత్తం 10 కోట్లను అందజేస్తున్నానని , తన విరాళం పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు .జనసేన పార్టీకి చిన్న కూలి కూడా తన సంపాదనలో వంద రూపాయలు ఇచ్చి పార్టీ ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతున్నారని పవన్ అభినందించారు. ఓ బేల్దారి మేస్త్రి లక్ష విరాళం అందించారని గుర్తు చేశారు. పింఛను నుంచి వచ్చే సొమ్ములో కొంత భాగం పార్టీకి తమ వంతుగా పంపుతున్న సగటు మనుషులెందరో ఉన్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు. వారంతా ఎన్నో ఆశలతో, ఆశయాలతో జనసేన కోసం విరాళాలు అందిస్తున్నారని పవన్ తెలిపారు. ఇక పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న పవన్ కళ్యాణ్.. పిఠాపురం వాసులకు ఆరు గ్యారంటీలు సైతం ప్రకటించారు. తాను గెలిస్తే పిఠాపురాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పారు .