గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంపై డ్రోన్‌ పలుమార్లు చక్కర్లు కొట్టడం కలకలానికి దారి తీసింది. దీంతో, పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్ల సాయంతో కార్యాలయంలో ఉన్న వారి కదలికలు, పరిసరాలను చిత్రీకరించేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు.  ఈ నెల ఒకటో తేదీన రాత్రి 9.45, 11.15, అర్ధరాత్రి 12.00 గంటలకు డ్రోన్ సంచారాన్ని సిబ్బంది గుర్తించారని, తిరిగి 16న రాత్రి 9.30 గంటలకు, 12.30 గంటలకు, మరుసటి రోజు తెల్లవారుజామున 4.30 గంటలకు, ఉదయం 9 గంటలకు డ్రోన్‌ సంచారాన్ని గుర్తించారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సమయాల్లో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కార్యాలయంలోనే ఉన్నట్టు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలతో పవన్ భద్రతకు, కార్యాలయానికి వచ్చే సందర్శకులకు ముప్పు పొంచి ఉందని తెలిపారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని సీఐ మల్లికార్జునరావుకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. డ్రోన్లను పట్టుకునేందుకు భద్రతా సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని పేర్కొన్నారు.

Previous articleయోగి ఆదిత్యనాథ్ దీపావళి కానుక… గ్యాస్ సిలిండర్ ఉచితం!
Next articleగాంధీభవన్ రిమోట్ గాడ్సే చేతిలో మాడి మసైపోతోంది….కేటీఆర్