ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర ప్రజలకు తీపి కబురు అందించారు. దీపావళి పండుగ సందర్భంగా గ్యాస్ సిలిండర్‌ను ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఉన్న వారందరికీ ఈ దీపావళి సందర్భంగా ఉచిత గ్యాస్ ఇస్తామని ప్రకటించారు. మంగళవారం బులంద్ షహర్‌లో రూ.632 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ కనెక్షన్లు పొందిన వారందరికి సిలిండర్ ధరను రూ.300 మేర తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిందని తెలిపారు. ఇదే సమయంలో యూపీలోని ఉజ్వల యోజన లబ్ధిదారులకు దీపావళి పర్వదినం కానుకగా ఒక గ్యాస్ సిలిండర్‌ను ఉచితంగా అందిస్తామన్నారు. 2014లో బీజేపీ అధికారంలోకి రాకముందు గ్యాస్ కనెక్షన్ పొందడం చాలా కష్టంగా ఉండేదని, ఇప్పుడు సులభమైందన్నారు.