తాను ముఖ్యమంత్రి అయ్యే అవకాశం అనుకోకుండా రావొచ్చునేమోనని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నల్గొండ జిల్లా గుర్రంపోడులో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ… ప్రజల హృదయాల్లో తాను ముఖ్యమంత్రి కావాలని బలంగా ఉందన్నారు. ఇప్పటి వరకు నాకు నేనుగా ఏ పదవినీ కోరుకోలేదని, సీఎం అయ్యే అవకాశం హఠాత్తుగా రావొచ్చునేమో అన్నారు. తనకు ఏ పదవి వచ్చినా కాదనేది లేదన్నారు. ఏ ముఖ్యమంత్రీ నిర్వర్తించనన్ని శాఖలను తాను చేబట్టానన్నారు. తాను ఇరవై ఒక్క ఏళ్లకే రాజకీయాల్లోకి వచ్చానని, 36 ఏళ్లకు మంత్రిని అయ్యానని చెప్పారు. తనకు 55 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని, ఏ పదవులైనా వాటంతట అవే వస్తాయని వ్యాఖ్యానించారు. తాను ఎప్పుడూ పదవుల రేసులో లేనని, ముఖ్యమంత్రి పదవే తనను అందుకుంటుందన్నారు. సీఎం పదవే వచ్చే అవకాశం ఉంటే తన కొడుకు రాజీనామా చేస్తే తాను తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్నారు.