బీఆర్ఎస్ ఇచ్చిన ఏ హామీలను నెరవేర్చకుండా ఇప్పుడు కొత్త మేనిఫెస్టోతో వస్తోందని, ప్రజలు వారి మాటలు నమ్మవద్దని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఇవాళ జంటనగరాల్లోని తుకారాం గేట్ ప్రాంతంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ… మాట తప్పిన బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోకు తెలంగాణ ప్రజలు మరోసారి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. అన్ని కులాలు, మతాలు కలిసి ఈ ఎన్నికలను వన్ సైడెడ్ చేద్దామని పిలుపునిచ్చారు. తద్వారా రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకుందామని, ఇందుకు ప్రజాశాంతి పార్టీలో చేరాలని కోరారు.

తమ ప్రజాశాంతి పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనుకునే వారు… రేవంత్ రెడ్డికి ఇచ్చినట్లుగా రూ.10 కోట్లు, రూ.50 కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదని, రూ.10వేలు మాత్రమే గూగుల్ పే లేదా ఫోన్ పే చేసి, రెజ్యుమే పెట్టాలన్నారు. అప్పుడు తమ కోర్ కమిటీ వచ్చి వారిని కలుస్తుందని చెప్పారు. ఎన్నికలు మరెంతో దూరంలో లేనందున ఆలస్యం చేయవద్దన్నారు. తమ పార్టీ తరఫున పోటీ చేయాలనుకునే వారు కార్యాలయానికి వచ్చి కూడా సంప్రదించవచ్చునని చెప్పారు.