స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబు మంగళవారం బయటకు వస్తారని ఆశిస్తున్నట్లు టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ చెప్పారు. చంద్రబాబు ఆరోగ్యంపై దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొందన్నారు. ఆయన నిర్దోషిగా బయటకు వస్తారని కాసాని ఆశాభావం వ్యక్తం చేశారు.

రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 87 స్థానాల్లో పోటీ చేయనుందని కాసాని స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ… ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను సిద్ధం చేశామన్నారు. ఈ జాబితాకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆమోదం లభించాక విడుదల చేస్తామన్నారు. తెలంగాణ ఎన్నికల్లో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రచారం చేస్తారన్నారు. 

తాను రెండు రోజుల క్రితం రాజమహేంద్రవరం కేంద్రకారాగారంలో ములాఖత్‌లో చంద్రబాబును కలిశానని, తెలంగాణ రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు చెప్పారు. ఇక్కడ టీడీపీ చాలా బలంగా ఉందని, అందుకే తాము పోటీ చేస్తున్నామన్నారు. జనసేన పార్టీతో కలిసి ముందుకు సాగాలా? లేదా? అనే త్వరలో నిర్ణయిస్తామన్నారు.