ఆంధ్రప్రదేశ్‌‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 17 లోక్‌సభ స్థానాల్లో గెలువబోతోందని జోస్యం చెప్పారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఈసారి తాము దేశవ్యాప్తంగా 400కుపైగా స్థానాల్లో విజయం సాధించబోతున్నట్టు చెప్పారు. 

యూసీసీని అమలు చేస్తాం
బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలోనే కాకుండా విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ మెరుగైన ఫలితాలు సాధించబోతున్నట్టు పేర్కొన్నారు. ఒడిశాలో 16-17 స్థానాల్లో గెలువబోతున్నామని, ఏపీలో 17, పశ్చిమ బెంగాల్‌లో 24 నుంచి 32 స్థానాల వరకు ఎన్డీయే కూటమి గెలుచుకుంటుందని వివరించారు. తాము మూడోసారి అధికారం చేపట్టాక విస్తృత సంప్రదింపుల అనంతరం దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని అమలు చేస్తామని చెప్పారు.