తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించే దిశగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రాష్ట్రంలో బస్సు యాత్ర చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ కాంగ్రెస్‌పై సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు. కర్ణాటక ప్రజలకు ఇచ్చిన హామీలను గద్దెనెక్కిన వంద రోజుల్లోనే భూస్థాపితం చేసిందంటూ హస్తం పార్టీపై ఫైరైపోయారు. మేనిఫెస్టోలో లేని హామీలను కూడా బీఆర్ఎస్ నెరవేర్చిందని గుర్తు చేశారు. కర్ణాటక చీకటి యుగంలోకి వెళ్లిపోయిందని చెప్పారు. తెలంగాణలో బస్సు యాత్ర తుస్సమనడం ఖాయమని జోస్యం చెప్పారు.  నమ్మి ఓటేసిన కర్ణాటక ప్రజలను నట్టేట ముంచిన కాంగ్రెస్‌ తెలంగాణలో నాటకాలకు తెరతీస్తే ఎవరూ నమ్మరని కేటీఆర్ అన్నారు. గాంధీభవన్‌ను గాడ్సేకు అప్పగించిన నాడే తెలంగాణ కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైందని పేర్కొన్నారు. గాంధీభవన్ రిమోటే గాడ్సే చేతిలో పడి మాడి మసైపోతోందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు కేటీఆర్ ‘ఎక్స్’లో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.