వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400 సీట్లు గెలవడం ఖాయమని కేంద్ర సహాయమంత్రి మురుగన్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఆయన తమిళనాడులోని ఈరోడ్‌లో పర్యటించి, చెన్నిమలై మురుగన్ ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ… రానున్న ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. డీఎంకే పాలనపై విమర్శలు గుప్పించారు. 

తమిళనాడు సహకార పాల ఉత్పత్తి ఫెడరేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయడం లేదన్నారు. గుజరాత్‌లో అమూల్ మంచి లాభాలతో పని చేస్తోందని, పాల ఉత్పత్తిదారులూ లబ్ధి పొందుతున్నారన్నారు. కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చాక భారత జాలర్లపై శ్రీలంక నావికాదళం దాడులు జరగలేదన్నారు.