కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం తెలంగాణలో చేపడుతున్న పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రాహుల్ సాయంత్రం ఢిల్లీకి వెళ్లాల్సి ఉండడంతో మార్పులు అనివార్యమయ్యాయి. సమయాభావం కారణంగా షెడ్యూల్‌లోని కొండగట్టు సందర్శన వాయిదాపడింది. అంతేకాదు సాయంత్రం నిజామాబాద్‌లో జరగాల్సిన పాదయాత్ర కూడా రద్దయ్యిందని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ముందుగా నిర్ణయించిన ఆర్మూర్‌లో పసుపు, చెరుకు రైతులతో రాహుల్ ముఖాముఖీ చర్చలో ఎలాంటి మార్పులేదు. రైతులతో భేటీ అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు జరిగే బహిరంగ సభలో రాహుల్ పాల్గొంటారు. అది ముగిసిన తర్వాత హెలికాఫ్టర్‌లో హైదరాబాద్‌కు తిరుగుపయనం అవుతారు. ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ వెళ్తారని పార్టీ ప్రకటించింది.  కాగా ఉదయం షెడ్యూల్ ప్రకారం.. కరీంనగర్‌లోని వీపార్క్ హోటల్ నుంచి ఉదయం 8.30 గంటలకు బయల్దేరారు. చొప్పదండి నియోజకవర్గం చేరుకోనున్నారు. ఉదయం 11 గంటలకు జగిత్యాలలో కార్నర్ మీటింగ్‌, మధ్యాహ్నం 12 గంటలకు వేములవాడ నియోజకవర్గంలో సమావేశం, 1 గంటకు వేములవాడలో కార్యక్రమాలతో రాహుల్ బిజీగా గడపనున్నారు. కోరుట్లలో  మధ్యాహ్నం కార్నర్ మీటింగ్ తర్వాత భోజనం చేస్తారు. కాగా రాహుల్ పర్యటన నిమిత్తం కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం ఏర్పాట్లు చేశాయి. రాహుల్ సభల్లో జనాలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా జనసమీకరణపై నేతలు దృష్టిసారించారు.