ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో రోజు రోజుకు కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రోజుకో కొత్త పేరు తెర పైకి వస్తుంది. తాజాగా లిక్కర్ స్కామ్ లో మేక శరణ్ పేరు వెలుగులోకి వచ్చింది. అసలు ఎవరి మేక శరణ్ ? కవితకు ఇతనికి సంబంధం ఏమిటి.. ? ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ముడుపుల వ్యవహారంలో ఇతను పోషించిన పాత్ర ఏమిటి అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ కవితకీ మేక శరణ్ కి సంబంధం ఏంటి అనే విషయానికి వస్తే మేక శరణ్ ..కవిత ఆడబిడ్డ కొడుకు.. కవిత మేనల్లుడు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇతను కూడా కీలక భూమిక పోషించినట్టుగా తాజాగా ఈడీ వెల్లడించింది. ఇటీవల ఈడి అధికారులు కవిత ఇంట్లో దాడులు చేసిన సమయంలో మేక శరణ్ అక్కడే ఉన్నారని సమాచారం . అప్పుడు మేక శరణ్ ఫోన్ ని కూడా ఈడీ అధికారులు సీజ్ చేశారు. దీంతో అతని ఫోన్లో సౌత్ గ్రూప్ కి సంబంధించిన లావాదేవీల వ్యవహారంపై చాటింగ్ ను గుర్తించిన ఈడీ ఈ స్కామ్ లో అతని పాత్ర గురించి దర్యాప్తు చేస్తుంది .ఆదివారం కవితను ప్రశ్నించిన ఈడీ అధికారులు మేక శరణ్ గురించి ప్రదేపదే ప్రస్తావించడం, అతని ఆర్థిక లావాదేవీలపై, అతను నిర్వహించే వ్యాపారాలపై ప్రశ్నించడం జరిగిందని తెలుస్తోంది . మొన్నటికి మొన్న కవితను మరికొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరిన క్రమంలో కూడా రౌస్ అవెన్యూకోర్టులో ఈడీ అధికారులు కవితను మేక శరణ్ కు సంబంధించిన సమాచారాన్ని అడిగినట్టు పేర్కొన్నారు. మేక శరణ్ కు సమీర్ మహేంద్రు కు కూడా సంబంధాలు ఉన్నాయని గుర్తించిన ఈడీ అధికారులు సమీర్ మహేంద్రును మరో మారు విచారణకు రావాలని సమన్లు జారీ చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉందని గుర్తించడంతో తాజాగా ఈడి అధికారులు కవిత ఆడపడుచు అఖిల ఇంట్లో సోదాలు చేశారు. అఖిల కుమారుడు మేక శరణ్ ను ఏ సమయంలోనైనా ఈడి అధికారులు అరెస్టు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ కేసులో అప్రూవర్లు గా మారిన సౌత్ సంస్థలో ఉన్న కవిత మాజీ సీఏ బుచ్చిబాబు, మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాసులును కూడా మరోమారు మేక శరణ్ గురించి విచారించనున్నట్టు తెలుస్తుంది.