భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే, పార్టీ అసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్ప షాక్ ఇచ్చారు. బుధవారం ఈమేరకు తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధిష్ఠానానికి పంపించారు. గురువారం మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని కోనప్ప అనుచరులు వెల్లడించారు. కోనప్పతో పాటు ఆయన సోదరుడు, పార్టీ జెడ్పీ ఇన్ చార్జి చైర్మన్ కోనేరు కృష్ణారావు కూడా బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. కోనప్ప అనుచరులు పెద్ద సంఖ్యలో పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల కోనప్ప తన సోదరుడితో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. దీంతో కోనప్ప పార్టీ మారుతారని ప్రచారం జరిగింది.

తాజాగా జిల్లా అధ్యక్ష పదవికి కోనప్ప రాజీనామా చేసి పార్టీ మారడం కన్ఫార్మ్ అని కోనప్ప స్పష్టం చేశారు. బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తును జీర్ణించుకోలేకే కోనప్ప పార్టీని వీడుతున్నారని సమాచారం. కోనప్పతో పాటు జిల్లాలోని ద్వితీయశ్రేణి నేతలు ఎంతమంది బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పనున్నారనేది సస్పెన్స్ గా మారింది. లోక్ సభ ఎన్నికల వేళ ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో బలమైన నాయకుడు కోనప్ప పార్టీని వీడడం బీఆర్ఎస్ కు గట్టి ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.