మాజీ మంత్రి, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్‌ సునీత రాజకీయ రంగ ప్రవేశంపై గత కొంతకాలంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో నేడు కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి వైఎస్ షర్మిల‌తో సునీత నేడు (సోమవారం) భేటీ కానున్నారు. ఇడుపులపాయలో వీరిద్దరూ సమావేశం కానున్నారు. సునీత పొలిటికల్ ఎంట్రీపై చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. 

రాజకీయంగా తాను వేయాల్సిన అడుగులపై షర్మిలతో సునీత చర్చించనున్నట్టు సమాచారం. ఈ భేటీలో సునీత కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. మరి భేటీ తర్వాత ఏదైనా ప్రకటన ఉంటుందా? లేదా? అనేది వేచిచూడాల్సి ఉంది. వివేకా హత్య కేసు నేపథ్యంలో సీఎం జగన్‌తో సునీతకు దూరం పెరిగింది. మరోవైపు తండ్రి హత్యపై న్యాయ పోరాటంలోనూ సునీతకు షర్మిల అండగా నిలిచిన విషయం తెలిసిందే.