తెలంగాణ శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అభ్యర్థులు ప్రచారంలో తీరికలేకుండా గడుపుతున్నారు. ఈ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన బర్రెలక్క అలియాస్ శిరీష స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. సోషల్ మీడియాలో విపరీతమై ఫాలోయింగ్ కలిగిన బర్రెలక్క ప్రచారం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి యువత తరలివస్తున్నారు. 

కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్ద కొత్తపల్లి మండలం వెనచర్లలో శిరీష నిన్న ఇంటింటి ప్రచారంలో ఉండగా కొందరు గుర్తు తెలియని దుండగులు ఆమె సోదరుడిపై కత్తులతో దాడి చేశారు. వీరి దాడిలో శిరీష సోదరుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ప్రచారానికి లభిస్తున్న మద్దతును చూసి ఓర్వలేని వారే ఇలా దాడులకు పాల్పడున్నారని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.