ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్టును చూపించి తాము ఓట్లు అడుగుతామని, కాళేశ్వరం ప్రాజెక్టును చూపించి ఓట్లు అడిగే దమ్ము కేసీఆర్‌కు ఉందా? అని ప్రశ్నించారు. నిజామాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… నాగార్జున సాగర్‌ను తాము చూపిస్తామని, కుంగిపోయిన మేడిగడ్డను మీరు చూపించగలరా? అన్నారు. కేసీఆర్‌కు దమ్ముంటే తన సవాల్ స్వీకరించాలన్నారు.

తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పిన కేసీఆర్ పదేళ్లు గడిచినా తెరిపించలేదని విమర్శించారు. ఇప్పటి వరకు షుగర్ ఫ్యాక్టరీని ఎందుకు తెరిపించలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీకి 80 సీట్లకు పైగా వచ్చి, అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ వేధించారని ధ్వజమెత్తారు. మద్దతు ధర కోసం అడిగిన ఎర్రజొన్న రైతులపై కేసు నమోదు చేశారన్నారు.