2019 ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను తారుమారు చేసే సంకల్పంతో విపక్షాలన్నీ ఒక్కటవుతున్నాయి. ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చరిష్మాను ఢీకొనాలంటే బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీభేషజాలను పక్కనపెట్టి మరీ ఒక్కటవ్వాలని భావిస్తున్నాయి. అందులో భాగంగా తొలి కీలక భేటీ జూన్ 23న బీహార్ రాజధాని పాట్నాలో జరగబోతోంది. ఇలాంటి ప్రయత్నాలు గతంలో చాలానే జరిగినా ఓ కార్యరూపాన్ని సంతరించుకోలేదు. కానీ ఈసారి మాత్రం దాదాపు 18 విపక్షాలు ఒకే మాట మీద నిలిచేలా కనిపిస్తున్నాయి. అది వారి ప్రయోజనం కోసమే అనేకంటే నరేంద్ర మోదీని గద్దెదింపేందుకే అని చెప్పుకోవాల్సి వుంటుంది. ఇపుడు కలుస్తున్న పార్టీల అధినేతల్లో ఎవరికి వారు తాము ప్రధాన మంత్రి కావాలన్న లక్ష్యం వున్న వారే. కానీ, హస్తిన పీఠం మీద నరేంద్ర మోదీ ఉన్నంతకాలం వారి కోరిక కలగానే మిగిలిపోతుందన్న భయాందోళనే ఇపుడు వారందరినీ కామన్ ప్లాట్‌ఫామ్ మీదకు తెస్తుందని చెప్పాలి. ప్రస్తుతం జరుగుతున్న భేటీని బీహార్ సీఎం, జెడియూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ నిర్వహిస్తున్నారు. తొలుత జూన్ 12నే ఈ సమావేశాన్ని నిర్వహించాలని నితీశ్ భావించినా.. కాంగ్రెస్ పార్టీ మోకాలడ్డింది. తమ అభిప్రాయం తీసుకోకుండానే నితీశ్ ఏకపక్షంగా విపక్షాల సమావేశం తేదీని, వేదికను ఖరారు చేశారని కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆదిలోనే హంసపాదు ఎందుకు అనుకున్నారో ఏమోగానీ నితీశ్ కుమార్ వెనక్కి తగ్గారు. కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలకు అనుకూలమైన తేదీని నిర్ణయించారు. సమావేశాన్ని సిమ్లాలోనిర్వహించాలని కాంగ్రెస్ నేతలు భావించినా.. అది రాంగ్ సిగ్నల్స్ వెళ్ళడానికి కారణమవుతుందనుకున్నారో ఏమో నితీశ్ నిర్ణయించిన పాట్నానే వేదికగా కాంగ్రెస్ నేతలు అంగీకరించారు. దాంతో పాట్నా భేటీకి ముహూర్తం, వేదిక ఖరారయ్యాయి.