ప్ర‌ధాని మోదీ గురువారం జ‌మ్మూక‌శ్మీర్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్తున్నారు. 2019 ఆగ‌స్టులో ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు త‌ర్వాత క‌శ్మీర్‌కు మోదీ వెళ్ల‌డం ఇదే మొద‌టిసారి. మ‌రోవైపు ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో ఇప్ప‌టికే జ‌మ్మూక‌శ్మీర్‌లో భారీ బందోబస్తు ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. వేలాదిగా పోలీసులు, ఆర్మీ బందోబ‌స్తు విధుల్లో ఉన్నారు. ఇక ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని జ‌మ్మూక‌శ్మీర్‌లో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేయ‌నున్నారు. శ్రీన‌గ‌ర్‌లో ప‌లు అభివృద్ధి ప్రాజెక్టుల ఆవిష్క‌ర‌ణ త‌ర్వాత ఆయ‌న బ‌హిరంగ సభ‌లో ప్ర‌సంగిస్తార‌ని తెలిసింది. శ్రీన‌గ‌ర్‌లోని బ‌క్షి మైదానంలో జ‌ర‌గ‌నున్న ‘విక‌సిత్ భార‌త్‌.. విక‌సిత్ జ‌మ్మూక‌శ్మీర్’ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వుతారు. అలాగే కేంద్ర పాలిత ప్రాంతంలో వ్య‌వ‌సాయ ఆర్థిక వ్య‌వ‌స్థ అభివృద్ధి కోసం సుమారు రూ.5వేల కోట్ల విలువైన కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌ధాని ప్రారంభిస్తారు. దీంతో పాటు శ్రీన‌గ‌ర్‌లోని హ‌జ్ర‌త్ మందిరంలో స్వ‌దేశ్ ద‌ర్శ‌న్‌, ప్ర‌సాద్ ప‌థ‌కాల కింద రూ.1400కోట్ల వ‌ర‌కు పర్యాటక రంగానికి చెందిన ప్రాజెక్టుల‌ను ప్రారంభిస్తార‌ని స‌మాచారం. అంతేగాక ఇటీవ‌ల కొత్త‌గా కొలువులు సాధించిన దాదాపు 1000 మందికి మోదీ అపాయింట్‌మెంట్ లెట‌ర్లు ఇవ్వ‌నున్నారు. అలాగే 2వేల రైతు సేవా కేంద్రాల‌ను ఏర్పాటుచేస్తార‌ని బీజేపీ పార్టీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.