తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నో రోజుల గడువు లేదు. సమయం ముంచుకొస్తోంది. ఇదే సమయంలో ఎన్నికల గుర్తులు ప్రధాన పార్టీలను కలవరపెడుతున్నాయి. గ్లాసు గుర్తు అంటేనే అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది జనసేన. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీతో కలిసి జనసేన పోటీ చేస్తోంది. రాష్ట్రంలో 8 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దించింది. ఈ నియోజకవర్గాల్లో జనసేనకు గ్లాసు గుర్తును ఎన్నికల అధికారులు కేటాయించారు. ఇతర స్థానాల్లో ఇండిపెండెంట్లకు కూడా ఇదే గుర్తును ఇచ్చారు. ఈ పరిణామం ఇప్పుడు బీజేపీ, జనసేన శ్రేణుల్లో గుబులు రేపుతోంది. 

గ్లాసు గుర్తును చూసి జనసేనగా భావించి పలువురు ఓటర్లు ఓటు వేసే అవకాశం ఉందని ఇరు పార్టీల నేతలు కలవరపాటుకు గురవుతున్నారు. దీంతో, ఓటర్లకు అర్థమయ్యేలా గుర్తు గురించి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని కూడా ఇదే సమస్య వెంటాడుతోంది. కారు గుర్తును పోలిన రోడ్ రోలర్, రోటీ మేకర్ వంటి గుర్తులు గులాబీ పార్టీని కలవరపెడుతున్నాయి. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు.