ఆంధ్రప్రదేశ్‌లో ఎలా తిరుగుతున్నానో… ఇక నుంచి తెలంగాణలోను అలాగే తిరుగుతానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తెలంగాణ ధైర్యంతోనే తాను ఆంధ్రాలో రౌడీలను, ఫ్యాక్షనిస్టులను ఎదుర్కొంటున్నానని తెలిపారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా హన్మకొండలో సకల జనుల విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆంధ్రాలో రౌడీలు రాజ్యమేలుతున్నారని.. గూండాల పాలన నడుస్తోందని, అలాంటి పరిస్థితిని తట్టుకొని తాను నిలబడుతున్నానంటే వరంగల్ పోరాటస్ఫూర్తే కారణమన్నారు. బలిదానాల తెలంగాణలో ఇంత అవినీతి ఉంటుందని తాను ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కమీషన్ల రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. తనకు ఆంధ్రా జన్మనిస్తే తెలంగాణ పునర్జన్మనిచ్చిందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని, పదేళ్ల పాటు తాను తెలంగాణ గురించి మాట్లాడలేదని, దశాబ్దం తర్వాత ఇప్పుడు మాట ఇస్తున్నానని, వచ్చే ఏడాది నుంచి ఆంధ్రాలో లాగే తెలంగాణలోనూ తిరుగుతానని స్పష్టం చేశారు. ఏ మార్పు కోసం తెలంగాణ బిడ్డలు చనిపోయారో అది సాధిద్దామన్నారు. బలిదానాలపై ఏర్పడిన రాష్ట్రం అవినీతిమయం కావడం బాధించిందన్నారు. అవినీతిరహిత తెలంగాణ రావాలన్నారు. తనకు తెలంగాణ ఎంతో బలాన్నిచ్చిందన్నారు. తన పోరాటానికి తెలంగాణ యువత అండగా ఉందన్నారు.