ఆసియాలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్‌ల వివాహ సమయం దగ్గరపడుతోంది . ఈ నేపథ్యంలో అంబానీ కుటుంబం పెళ్లి పనుల్లో నిమగ్నమైంది. అయితే ఇన్ని రోజులు ప్రీ వెడ్డింగ్ వేడుకల గురించి అంతా మాట్లాడుకోగా ఇప్పుడు అనంత్ అంబానీ పెళ్లి ఆహ్వాన పత్రికపై చర్చించుకుంటున్నారు. ఇటీవలే నీతా అంబానీ ఈ వెడ్డింగ్ కార్డును కాశీ విశ్వేశ్వరుడి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఆ తర్వాత సన్నిహితులు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులకు అంబానీ కుటుంబం ఆహ్వాన పత్రికలు అందిస్తూ పెళ్లికి పిలుస్తోంది . ఈ క్రమంలో అనంత్ – రాధిక వెడ్డింగ్ కార్డు వీడియోలు బయటకు వచ్చి ఇప్పుడు ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనంత్ అంబానీ- రాధికల పెళ్లి కోసం సిద్ధం చేసిన ఆహ్వాన పత్రిక విలువ అక్షరాలఆరున్నర లక్షలు ఉంటుందట. ఈ కార్డులో మూడు కిలోల వెండి ఆలయం, 24 క్యారెట్ల బంగారంతో చేసిన దేవుళ్ల విగ్రహాలు ఉంచారు . గతంలో అంబానీ కుమార్తే ఇషా అంబానీ పెళ్లి కార్డు ధర 3 లక్షలుగా ఉంటేనే అంతా నోరెళ్లబెట్టారు. ఇప్పుడు అనంత్ అంబానీ పెళ్లి కార్డు ఆరున్నర లక్షలు ఉండడం గమనార్హం. ఈ వెడ్డింగ్ కార్డును కొంత మంది ముఖ్యమంత్రులు, ఇతర వీవీఐపీలకు పంపించినట్లు తెలుస్తోంది. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ వివాహం జులై 12వ తేదీన ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది. ప్రత్యేకంగా రూపోందించిన పెళ్లి కార్డు వీడియోలు చూస్తే.. అందులో వెండితో చేసిన చిన్న గుడి, అందులో బంగారు విగ్రహం కనిపిస్తున్నాయి. పెళ్లి కార్డుకు సంబంధించిన బాక్స్ తెరవగానే బ్యాక్ గ్రౌండ్‌లో హిందీలో విష్ణు సహస్రనామం వినిపించేలా ఏర్పాటు చేశారు. ఆలయంలో కాకుండా ఇతర బాక్సుల్లోనే బంగారంతో చేసిన దేవుళ్ల విగ్రహాలు ఉన్నాయి. పెళ్లి కార్డులో వినాయకుడు, శ్రీవిష్ణువు, లక్ష్మీదేవి, రాధా- కృష్ణ, దుర్గాదేవి వంటి దేవుళ్ల చిత్రాలు కనిపిస్తున్నాయి. అలాగే బాక్సులో మరో చిన్న వెండి పెట్టే ఉంది. అందులో ఓం అని ఎంబ్రాయిడరీ శాలువా, నెట్ హాంకీ వంటివి ఉన్నాయి. అలాగే బంగారంతో చేసిన వివిధ దేవుళ్ల విగ్రహాలు సైతం ఉన్నాయి. దీని ప్రకారం చూసుకుంటే పెళ్లి కార్డుతో పాటు అతిథులకు పలు బహుమతులు సైతం ఇస్తున్నారని తెలుస్తోంది.