తెలంగాణ చరిత్రలో తొలిసారి బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రకటించిన పార్టీ తమదేనని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఆదివారం చేవెళ్లలో నిర్వహించిన బీజేపీ సకల జనుల సంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… దళితబంధులో బీఆర్ఎస్ నేతలు కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు. ఈ తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలో నరేంద్రమోదీ ప్రభుత్వం తెలంగాణ కోసం రూ.5 లక్షల కోట్ల నిధులను ఖర్చు చేసిందన్నారు. తెలంగాణలో బీజేపీ గెలిస్తే ఉజ్వల వినియోగదారులకు ఏడాదికి నాలుగు సిలిండర్లు ఉచితంగా అందిస్తామన్నారు.

బీఆర్ఎస్ ఈ తొమ్మిదేళ్లలో ఎంతమందికి డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చింది? అని ప్రశ్నించారు. నరేంద్రమోదీ పాలనలో భారత్ ప్రపంచంలోనే అయిదో ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందన్నారు. బీజేపీని గెలిపిస్తే వరికి మద్దతు ధరను రూ.3100కు పెంచుతామన్నారు. ఎరువుల కోసం రూ.2100 ఇన్‌పుట్ సబ్సిడీని అందిస్తామన్నారు. మహిళా సంఘాలకు ఒక శాతం వడ్డీకే రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు.