బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఓసీ గురుకులాలు ఏర్పాటు చేస్తామని, ఈ మేరకు సీఎం కేసీఆర్ మేనిఫెస్టోలో ప్రకటించారని మంత్రి హరీశ్ రావు చెప్పారు. సిద్దిపేటలో రాష్ట్ర గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. అరవై ఏళ్ల విపక్షాల పాలనలో తెలంగాణలో 268 గురుకులాలు ఉంటే, కేసీఆర్ ప్రభుత్వం వాటిని వెయ్యికి పెంచిందన్నారు. అంతకుముందు గురుకులాల్లో 1.90 లక్షలమంది చదివితే ఇప్పుడు ఆరు లక్షలమంది చదువుతున్నారన్నారు. గురుకులాల్లో చదివిన 6,652 మంది ఇప్పుడు దేశ, విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారన్నారు. గురుకుల పాఠశాలలను ఇంటర్ నుంచి డిగ్రీకి అప్ గ్రేడ్ చేస్తామన్నారు. అన్ని వర్గాలు చదువుకునేలా చర్యలు చేపట్టామన్నారు.