డీప్ ఫేక్ మహిళలకు మాత్రమే కాదని, రాజకీయ నాయకులకు కూడా ప్రమాదకరమేనని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రత్యర్థులు డీప్ ఫేక్ వాడి తమపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. తాను రష్మిక మందన్న అంత ఫేమస్ కాదని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో తామే గెలుస్తామని, ఈ విషయం ప్రతిపక్షాలకు కూడా తెలుసునని, కానీ వారు నటిస్తున్నారన్నారు. తన చెల్లి కవిత చాలా డైనమిక్ అని, కుటుంబంలో అత్యంత ధైర్యవంతురాలని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని గ్రాండ్ కాకతీయలో ‘వుమెన్ ఆస్క్ కేటీఆర్’ పేరుతో మహిళలతో నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ… తన చిన్నప్పటి నుంచి కేసీఆర్ ప్రజాజీవితంలో ఉన్నారని, అందుకే తనపై ఆయన ప్రభావం తక్కువగా ఉండేదని, తన తల్లిని చూసి చాలా నేర్చుకున్నానన్నారు. తన సతీమణి చాలా ఓపికగా ఉంటారన్నారు. తన కూతురు చిన్న వయస్సులోనే బాగా ఆలోచన చేస్తోందన్నారు. కూతురు పుట్టాక తన జీవితం చాలా మారిందన్నారు. ఇద్దరు పిల్లల్నీ సమానంగా చూస్తానన్నారు.