తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి పదోన్నతి పొంది పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఈ ఆదివారం సొంత నియోజకవర్గంలో సేదదీరారు. కరీంనగర్ లో పర్యటించిన ఆయన ఓ గల్లీలో ఆడుకుంటున్న పిల్లలను పలకరించారు. వారితో సరదాగా ముచ్చటించారు. “నా పేరేంటి?” అంటూ ఓ బాలుడ్ని అడగ్గా… “సంజయ్” అంటూ ఆ బాలుడు వెంటనే చెప్పడంతో అందరూ నవ్వేశారు. అనంతరం బండి సంజయ్ ఆ బాలుడి నుంచి సైకిల్ తీసుకుని తొక్కారు. సైకిల్ వెనుక పిల్లల్ని ఆ వీధిలో సైక్లింగ్ చేశారు. అనంతరం నగరంలో పర్యటిస్తూ ప్రజలను పలకరిస్తూ ముందుకు సాగారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయనే పంచుకున్నారు. “నాదైన శైలిలో ఈ ఆదివారాన్ని ఆస్వాదించాను. ఈ భూమ్మీద నాకు అత్యంత ఇష్టమైన స్థలం కరీంనగర్ లో, నాకిష్టమైన ప్రజలతో హాయిగా గడిపాను. స్వచ్ఛమైన ఆనందం అంటే ఇదే” అని బండి సంజయ్ ట్వీట్ చేశారు.