జైలర్ మూవీ సక్సెస్ తర్వాత రజనీకాంత్ ఉత్తరాదిన పర్యటిస్తున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, సమాజ్ వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ లను రజనీకాంత్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా రజనీకాంత్ చేసిన పని కొందరు అభిమానులకు నచ్చలేదు. దీంతో తమిళ సూపర్ స్టార్ పై విమర్శల వాన కురుస్తోంది. శనివారం లక్నోలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను ఆయన నివాసంలో రజనీకాంత్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా యోగి పాదాలకు రజనీకాంత్ నమస్కరించారు. ఈ చర్యే కొందరికి నచ్చలేదు. ‘‘72 ఏళ్ల వ్యక్తి 51 ఏళ్ల వ్యక్తి పాదాలను తాకడం ఏంటి? మత పరంగా గుడ్డిగా వ్యవహరించినప్పుడే ఇలాంటిది సాధ్యపడుతుంది’’అని అక్షిత్ అనే యూజర్ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు.‘‘వయసులో 20 ఏళ్ల పెద్ద అయిన రజనీకాంత్ మత విద్వేషాన్ని వ్యాప్తి చేసే సీఎం పాదాలను తాకారు. దక్షిణాది ప్రజలు ఆయనకు ఇచ్చిన గౌరవం రెండు సెకండ్లలో పోయింది. ఫాసిస్టులకు మద్దతు పలికిన వెన్నులేని వ్యక్తిగా చరిత్ర ఆయన్ని గుర్తు పెట్టుకుంది’’అని అమీనా అనే యూజర్ పోస్ట్ చేశారు. ప్రధానంగా ఎక్కువ మంది యూజర్లు దీన్నే ఎత్తి చూపుతూ రజనీకాంత్ ను తప్పుబడుతున్నారు.