నెలాఖరు లేదా వచ్చేనెల మొదటివారంలో ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్‌(టీఎస్‌ఎస్‌పీ) విభాగం కానిస్టేబుళ్లకు త్వరలో శిక్షణ ప్రారంభించేందుకు ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో శిక్షణను ప్రారంభించనున్నారు. శిక్షణకు అనువైన మైదానాలతో పాటు శిక్షణార్థుల బసకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. రాష్ట్రవ్యాప్తంగా 2022 ఏప్రిల్‌లో 15,644 కానిస్టేబుల్‌ స్థాయి పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ కాగా ఇందులో 5,010 పోస్టులు టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుళ్లవి. ఎంపిక ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. సివిల్‌, ఏఆర్‌, ఎస్‌పీఎఫ్‌ విభాగాల కానిస్టేబుళ్లకు గత నెల 21 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 28 కేంద్రాల్లో శిక్షణ ప్రారంభించారు. రాష్ట్రంలో 12వేల మంది శిక్షణకు మాత్రమే మైదానాలు, వసతి సదుపాయాలు ఉండటంతో వీరి శిక్షణను వాయిదా వేశారు. మరికొద్ది రోజుల్లో శిక్షణ ప్రారంభిస్తున్నట్లు అదనపు డీజీపీ అభిలాషబిస్త్‌ తెలిపారు.