జగన్ రెడ్డి చేసిన పాపాలకు ప్రతి ఒక్కరూ బాధితులేనని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు అన్నారు. “ఆంధ్ర ప్రజలారా తస్మాత్ జాగ్రత్త… రాష్ట్ర ప్రజల ఆస్తులు, భూములను కాజేసేందుకు కొత్త చట్టాన్ని తీసుకువచ్చిన భూ బకాసురుడు” అంటూ ఇవాళ ఆయన ఓ ఆడియో సందేశం వెలువరించారు. 

“జాగ్రత్తగా వినండి… ఇవాళ మనది అనుకున్న ఆస్తి రేపటి రోజున మనది కాకుండా చేసే కుట్రలకు వైసీపీ ప్రభుత్వం రూపకల్పన చేసింది. అది కూడా చట్టం పరిధిలో చేసింది. మీ తాత, మీ నాన్న, మీ అమ్మ గారో మీకోసం ఆస్తి కూడబెట్టి వారసత్వంగా ఇచ్చుంటారు. వాటి దస్తావేజులు మీ ఇంట్లోనే ఉంటాయి కదా, అలాగే ఆ దస్తావేజుల వివరాలు కూడా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో భద్రంగా ఉంటాయని మనకో ధైర్యం. 

కానీ జగన్ చేసిన కుట్రపూరిత నిర్ణయంతో మన ఆస్తుల వివరాలు మరెక్కడో ఉంటున్నాయి. అలాగే, కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నవాళ్లకు ఇక దస్తావేజులు ఇవ్వడంలేదు… ఒరిజినల్స్ అన్నీ సర్వర్ లో ఉంచేస్తారట! వాటి ఫొటోస్టాట్ కాపీలను మాత్రమే ఇవ్వాలని జగన్ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.