గత ఎన్నికల సమయంలో దారుణ హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత నేడు మీడియాతో మాట్లాడారు. తన తండ్రి హత్య కేసులో ఐదేళ్లుగా పోరాడుతున్నానని వెల్లడించారు. చదువు, తెలివి, స్థోమత ఉన్నా ఏమీ చేయలేక నిస్సహాయంగా మిగిలిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ పోరాటం తన కోసమే కాదని, సామాన్యుల కోసం కూడా అని సునీత స్పష్టం చేశారు. అవినాశ్ రెడ్డి అధికారంలోకి రాకూడదనేది తన లక్ష్యం అని పునరుద్ఘాటించారు. నిజాలు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని, ఆపై ప్రజలే నిర్ణయిస్తారని అభిప్రాయపడ్డారు. 

“2009కి ముందు కడప ఎంపీగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వివేకాలలో ఒకరు పోటీ చేసేవారు. వైఎస్ చనిపోయాక జగన్ ఎంపీగా ఉన్నారు. వైఎస్ మరణానంతరం పులివెందులలో పోటీపై చర్చ జరిగింది. పులివెందులలో పోటీకి భాస్కర్ రెడ్డి పేరు పరిశీలనకు వచ్చింది. అయితే, పులివెందులలో భాస్కర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని వివేకా వ్యతిరేకించారు.