దివంగత ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆయన చిత్రంతో ఉన్న రూ. 100 స్మారక నాణేన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఉన్న సాంస్కృతిక కేంద్రంలో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే, ఈ కార్యక్రమంలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమం ఆద్యంతం తొలి వరుసలో చంద్రబాబు పక్కనే రఘురాజు ఆసీనులయ్యారు. అనంతరం చంద్రబాబుతో ఆయన ప్రత్యేకంగా ముచ్చటించారు. జేపీ నడ్డాతో ఆనందంగా సెల్ఫీ దిగారు. నడ్డాతో చంద్రబాబు, పురందేశ్వరి, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు సమావేశమయినప్పుడు కూడా ఆయన వారితో పాటే ఉన్నారు. చంద్రబాబు, నడ్డాలకు మధ్య ఆయన నిల్చుని ఆ సమావేశంలో సంతోషంగా గడిపారు. ఈనాటి కార్యక్రమంలో రఘురాజు చంద్రబాబుతో హుషారుగా గడిపిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రఘురాజుకు చంద్రబాబు ఇచ్చిన ప్రాధాన్యత చర్చనీయాంశంగా మారింది.