ఢిల్లీ సాక్షిగా కుట్రలు చేయడం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు అలవాటేనని, ఈసారి మిమ్మల్ని అమ్మేసే ప్రయత్నాలు చేస్తున్నాడని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హెచ్చరించారు. ఢిల్లీలో ఎన్టీఆర్ రూ.100 నాణెం విడుదల సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు, పురందేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, రఘురామకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ ఫోటోలను ట్వీట్ చేస్తూ విజయసాయి విమర్శలు గుప్పించారు. ఇందులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు మాట్లాడుతున్న ఫోటోను ట్వీట్ చేశారు.ఢిల్లీ సాక్షిగా కుట్రలు చేయడం మీ మరిది గారికి అలవాటేనని పురందేశ్వరిని ఉద్దేశించి అన్నారు. కానీ ఈసారి మిమ్మల్ని తీసుకెళ్లి అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు చూడండి… అదీ హైలైట్ అని పేర్కొన్నారు. చంద్రబాబు జీవితంలో ఎవ్వరికీ విశ్వసనీయమైన స్నేహితుడు కాలేడన్న కమ్మటి వాస్తవం ఢిల్లీ నుంచి గల్లీ దాకా అందరికీ తెలుసునన్నారు.ఇంతకంటే ఆధారం కావాలా? చిన్నమ్మా! పురందేశ్వరి! పతీసమేతంగా మరిదిని తీసుకెళ్లి మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు ఇష్టంలేకపోయినా బలవంతంగా ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీకి తెలీదా, మీరంతా ఒకటేనని, అందుకే కదా దొంగ చేతికే తాళం ఇచ్చిందని వ్యాఖ్యానించారు.