జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ గతంలో తీసుకువచ్చిన ఆర్టికల్ 370ని ఎన్డీయే ప్రభుత్వం 2019లో రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం సబబేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీనిపై జనసేన పార్టీ అధినేత పవన్ స్పందించారు. 

ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకం అని అభివర్ణించారు. జమ్మూ కశ్మీర్ ను సంపూర్ణంగా భారతదేశంలో విలీనం చేయాలని కలలు గన్న భారత ప్రజలందరికీ సుప్రీంకోర్టు తీర్పు మరో విజయం అని జనసేన భావిస్తోందని వెల్లడించారు. ఇవి దేశ ప్రజలందరూ సంతోషంగా వేడుకలు జరుపుకునే మధుర క్షణాలు అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 

“భారత ప్రభుత్వం ఆర్టికల్  370ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఏకగ్రీవంగా సమర్థిస్తూ ఇచ్చిన తీర్పు పట్ల జనసేన పార్టీ హర్షాతిరేకం వ్యక్తం చేస్తోంది. జమ్మూ కశ్మీర్ కు  ఆర్టికల్ 370 ద్వారా లభించిన ప్రత్యేక హోదా భారతదేశ సమైక్యత, సార్వభౌమాధికారానికి విఘాతం కలిగిస్తోందని భావించిన కేంద్రం ఆ ఆర్టికల్ ను రద్దు చేసింది. ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగపరంగా చెల్లుబాటేనని ఇవాళ తన తీర్పు ద్వారా సుప్రీంకోర్టు ధ్రువీకరించింది.