వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ… ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాణిస్తారని చెప్పారు. షర్మిల ఏపీలో బాగా పని చేస్తారని వ్యాఖ్యానించారు. పార్టీలోకి షర్మిల ఎంట్రీ అయ్యారని… ఏపీ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇది శుభవార్తే అన్నారు. ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే పైట్ చేయాలని తాను గతంలోనే చెప్పానని గుర్తు చేశారు. షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వెళ్లాలని… అప్పుడే ప్రజల ఆలోచన విధానం మారుతుందని వ్యాఖ్యానించారు.

తెలంగాణలో కాంగ్రెస్ బలపడి అధికారంలోకి వచ్చిందని… ఏపీలోనూ మన పార్టీ బలపడాల్సిన అవశ్యకత ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని వారు అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని సూచించారు. ఏపీ కాంగ్రెస్ నేతలు… షర్మిలను అక్కడకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. సోనియా గాంధీ ఆరు గ్యారెంటీల పథకం ప్రకటనతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించినట్లు తెలిపారు.