ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురికి కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. టీడీపీ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరికి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో చోటుదక్కింది. టీడీపీ నుంచి శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడికి కేంద్ర కేబినెట్ మంత్రి పదవి వరించింది. బీజేపీ నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మకు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌కు సహాయ మంత్రిపదవులు దక్కాయి. అయితే శాఖల కేటాయింపుపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కాగా 2014 సార్వత్రిక ఎన్నికల నుంచి శ్రీకాకుళం లోక్ సభ స్థానం నుంచి రామ్మోహన్ నాయుడి వరుస విజయాలు సాధించి హ్యాట్రిక్ కొట్టారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ 3లక్షల 27 వేయిల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక పెమ్మసాని చంద్రశేఖర్ విషయానికి వస్తే ఎంపీగా గెలుపొందిన తొలిసారే ఆయనను అదృష్టం వరించింది. గుంటూరు ఎంపీగా తొలిసారిగా గెలుపొందిన పెమ్మసానికి ఏకంగా కేంద్ర సహాయ మంత్రిపదవి వరించింది. అయితే పెమ్మసాని చంద్రశేఖర్‌ 2014లోనే ఎంపీగా పోటీ చేయాలనుకున్నా కానీ వివిధ రాజకీయ పరిణామాల నేపథ్యంలో అప్పట్లో ఆయన పోటీ చేయలేదు. 2024 ఎన్నికల్లో గుంటూరు లోక్ సభ నుంచి పోటీ చేసి 3,లక్షల 44 వేయిల 695 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పెమ్మసాని చంద్రశేఖర్ తండ్రి సాంబశివరావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఇక బీజేపీ ఎంపీ, నరసాపురం లోక్ సభ నియోజకవర్గం ఎంపీ భూపతి రాజు శ్రీనివాస వర్మను కూడా ఈసారి అదృష్టం వరించింది. 34 ఏళ్లుగా బీజేపీ కోసం పనిచేస్తూ వచ్చిన ఆయనకు బీజేపీ అధిష్టానం నరసాపురం ఎంపీ టికెట్ కేటాయించగా ఈ ఎన్నికల్లో గెలిచిన ఆయనకు కేంద్ర సహాయమంత్రి పదవి వరించింది. అయితే 2009 సార్వత్రిక ఎన్నికల్లో కూడా భూపతిరాజు శ్రీనివాసవర్మ నరసాపురం లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి అప్పట్లో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు మొదటిసారి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి పదవిని కూడా చేపట్టారు. మరోవైపు జనసేనకు మాత్రం ఈసారి నిరాశ ఎదురైంది. జనసేనకు కూడా మోదీ మంత్రివర్గంలో చోటు దక్కుతుందని అందరూ ఊహించారు. జనసేన మచిలీపట్నం, కాకినాడ లోక్ సభ స్థానాలలో గెలుపొందింది. మచిలీపట్నం ఎంపీగా వల్లభనేని బాలశౌరి విజయం సాధించారు. కాకినాడ నుంచి ఉదయ్ గెలుపొందారు. అయితే బాలశౌరికి కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని అందరూ భావించారు. అయితే ఏపీలో ముగ్గురికే అవకాశం ఇచ్చిన బీజేపీ.. ఇద్దరు టీడీపీ, ఒక బీజేపీ ఎంపీకి కేంద్ర మంత్రులుగా ఛాన్స్ ఇచ్చింది