బీఆర్ఎస్ అధికారంలో ఉండగా, వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు, వారి ప్రధాన అనుచరులతో పాటు , బీఆర్ఎస్ కు చెందిన కొంతమంది కీలక నేతల ఫోన్ లను ట్యాప్ చేసినట్లుగా బీఆర్ఎస్ అగ్ర నేతలపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ లో అప్పటి ఇంటిలిజెన్స్ డిఐజి ప్రభాకర్ రావు తో పాటు, మరికొంతమంది అధికారులు కీలకంగా ఉన్నారు .రీసెంట్ గా టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సంచలన విషయాలను బయటపెట్టారు. .బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత నుంచి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మొదలుపెట్టినట్లు ఆయన వివరించారు.2016లో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభాకర్ రావును ఇంటెలిజెన్స్ డిఐజిగా నియమించింది.ఆ తరువాత ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ నిమిత్తం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా రాధా కిషన్ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ రిపోర్ట్ లో బీఆర్ఎస్ సుప్రీమో అని ప్రత్యేకంగా పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. అసలు విపక్ష పార్టీలకు చెందిన నేతలు, సొంత పార్టీలోని కొంతమంది కీలక నేతల ఫోన్ కాల్స్ ను ట్యాపింగ్ చేసేందుకే ప్రత్యేకంగా ప్రణీత్ రావును ఇంటెలిజెన్స్ విభాగానికి ప్రభాకర్ రావు తీసుకొచ్చారనే విషయాన్ని రాధా కిషన్ వెల్లడించారు . ఆ తరువాతే స్పెషల్ టీమ్ లతో ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్ జరిగిందన్నారు. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న నేతల కదలికల పై నిఘా పెట్టి , బీఆర్ఎస్ ను మరోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు చట్ట విరుద్ధంగా పనిచేసినట్లు రాధా కిషన్ అంగీకరించారు. , మునుగోడు, దుబ్బాక ఉప ఎన్నికల టైంలో కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి, ప్రతిపక్ష నేతలకు చెందిన డబ్బు సీజ్ చేయడం, బీఆర్ఎస్ డబ్బు తరలించే వాహనాలకు గవర్నమెంట్ స్టిక్కర్లు పెట్టి, ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసినట్లు రాధా కిషన్ వివరించారు.ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్లే దుబ్బాక ఎన్నికల సమయంలో రఘునందన్ రావు బంధువుకు చెందిన కోటి రూపాయలను సీజ్ చేసినట్లుగా తెలిపారు . అలాగే మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరుల ఫోన్ లు ట్యాపింగ్ చేసి, నగదును సీజ్ చేసినట్లుగా రాధాకిషన్ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు.అయితే ఈ వ్యవహారం అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే ఇదంతా జరిగినట్లుగా ప్రాథమిక ఆధారాలను సిద్ధం చేసుకోవడంతో ఈ కేసులో కేసీఆర్ కు నోటీసులు అందే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు.