పేదవారికి ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించే ఆరోగ్య శ్రీ పథకానికి ఏపీలో ఇబ్బందులు తలెత్తడంతో శనివారం నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులు వెల్లడించాయి. ఆరోగ్యశ్రీ కింద మే 4 నుంచి నగదు రహిత చికిత్సలు నిలిపివేస్తామని ఈ మేరకు నెట్‌వర్క్ ఆస్పత్రులు ప్రభుత్వానికి స్పష్టం చేశాయి. వెంటనే పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని.. లేకుంటే ఆరోగ్యశ్రీ సేవలు మే నాలుగు నుంచి అందించమని పేర్కొంటూ ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోకు నెట్ వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు లేఖ రాశాయి. కాగా ప్రభుత్వం నుంచి పెండింగ్ బకాయిల చెల్లింపులు గత ఆరునెలలుగా జరగలేదని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్‌ లేఖలో పేర్కొంది. బకాయిలు చెల్లించాలని పదే పదే విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేదని, దీంతో అప్పుల పాలయ్యామని ఆస్పత్రులు తెలిపాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతోనే ఆరోగ్య సేవలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆస్పత్రుల యాజమాన్యాలు లేఖలో స్పష్టం చేశాయి. ప్రభుత్వం ఇప్పటికైనా బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశాయి. బకాయిల చెల్లింపుపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని లేఖలో పేర్కొన్నాయి. మరోవైపు పెండింగ్ బకాయిలు చెల్లించాలంటూ ఎప్పటి నుంచో నెట్వర్క్ ఆస్పత్రులు కోరుతున్నాయి. అలాగే చికిత్సలకు ఇస్తున్న ప్యాకేజీల ధరలు కూడా పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. పదేళ్ల కిందటి ధరలతోనే ఇప్పటికీ చికిత్స అందిస్తున్నామని.. ఈ నేపథ్యంలో సర్జరీల ఛార్జీలు పెంచాలని కోరుతున్నాయి.