తనకు మీడియా లేదని, సాక్షి టీవీ, సాక్షి పత్రిక తనవి కాదని ముఖ్యమంత్రి జగన్ నాటకాలు ఆడుతున్నారంటూ టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. సాక్షి మీడియా జగన్ దేనని, వైఎస్ కుటుంబం మొత్తానికి సాక్షిలో వాటాలు ఉన్నాయని ఆయన చెప్పారు. జగన్ లక్కీ నెంబర్ లక్ష అని… లక్ష రూపాయల పెట్టుబడితో ఆయన పెట్టిన కంపెనీలన్నీ వేల కోట్లకు చేరుకున్నాయని అన్నారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

జగతి పబ్లికేషన్స్ కూడా లక్ష రూపాయల పెట్టుబడితో ప్రారంభించినదేనని వెంకటరమణారెడ్డి అన్నారు. ఇందులో విజయసాయిరెడ్డి రూ. 35 వేలు, జె.జగన్ మోహన్ రెడ్డి రూ. 30 వేలు, కామత్ అనే వ్యక్తి రూ. 35 వేలు పెట్టుబడి పెట్టారని తెలిపారు. తొలుత సాక్షి డైరెక్టర్ గా విజయసాయిరెడ్డి ఉన్నారని, ఆయన రాజీనామా చేసిన తర్వాత జగన్ డైరెక్టర్ అయ్యారని చెప్పారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా డైరెక్టర్ గా పని చేశారని తెలిపారు. ప్రస్తుతం వైఎస్ భారతి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారని చెప్పారు. భార్య డైరెక్టర్ గా ఉన్న సాక్షితో జగన్ కు సంబంధం లేదా? అని ఎద్దేవా చేశారు. సాక్షితో తనకు సంబంధం లేదని జగన్ పచ్చి అబద్ధాలు చెపుతున్నారని విమర్శించారు