ఇటీవల కేంద్ర ప్రభుత్వం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. చిరంజీవిని ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపించాలన్నది బీజేపీ ప్రణాళిక అంటూ ప్రచారం జరుగుతోంది. 

త్వరలో 15 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు జరగనుండగా, ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే 10 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. తెలంగాణ బీజేపీ నేత డాక్టర్ లక్ష్మణ్ యూపీ నుంచి రాజ్యసభకు వెళ్లారు. ఇప్పుడు చిరంజీవిని కూడా యూపీ కోటాలోనే రాజ్యసభకు పంపాలని కమలనాథులు భావిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. అయితే, చిరంజీవి ఈ ప్రతిపాదనను ఎంతవరకు అంగీకరిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. 

చిరంజీవి గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి, ఏపీలో కొన్ని సీట్లు గెలిచి, ఆపై తన పార్టీని కాంగ్రెస్ లో కలిపేశారు. యూపీఏ హయాంలో చిరంజీవి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. అప్పట్లో రాజకీయాల్లోకి వెళ్లిన కారణంగా 10 ఏళ్లు సినిమాలకు దూరమైన చిరంజీవి… మళ్లీ ఖైదీ నెం.150తో రీఎంట్రీ ఇచ్చారు. వరుస సినిమాలతో ఊపుమీదున్నారు. ఇప్పుడు మరోసారి రాజకీయాల్లోకి ఆయన వెళతారా అన్నది చర్చనీయాంశంగా మారింది .