సినీ నటి రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు. ఓ జాతీయ ఛానెల్ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ మార్ఫింగ్ వీడియో గురించి ప్రస్తావించారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ… ఇది దారుణమైన చర్య అన్నారు. రష్మిక డీప్‌ఫేక్ వీడియో గురించి తాను వార్తల్లో చూసినట్లు చెప్పారు. అదో చేదు అనుభవమని.. ఓ సెలబ్రిటీని ఇలా కించపరచడం, అవమానించడం దారుణమన్నారు. ఇలాంటి ఘటనల కట్టడికి చట్టపరంగా చర్యలు తీసుకువస్తే వాటిని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇలాంటి ఘటనలపై కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.కొంతమంది ఆకతాయిలు… జారా పటేల్ అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కి సంబంధించిన వీడియోకి రష్మిక మందన్న ముఖాన్ని మార్ఫింగ్ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది కాస్తా వైరల్‌గా మారింది. ఈ ఘటనపై పలువురు ప్రముఖులు ఇప్పటికే స్పందించారు. ఇలా మార్ఫింగ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. తొలుత కొంతమంది ఈ వీడియో రష్మికదే అనుకున్నప్పటికీ ఆ తర్వాత జరా పటేల్ వీడియోను ఎవరో రష్మిక ఫేస్‌తో మార్ఫింగ్ చేసినట్లు గుర్తించారు. ఇలా మార్ఫింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.